Monday, 11 September 2017

కావేరి నది పుష్కరాలు..........

కావేరి నది పుష్కరాలు..........
గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ సెప్టెంబర్‌ 12న కన్యారాశి నుంచి తులారాశిలో ప్రవేశం కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కావేరీ పుష్కరాలలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతారు. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి.
ఎక్కడ పుట్టింది?
పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో కావేరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి, ఓ అందాల పాపను ప్రసాదించాడు. కావేరి అని పేరు పెట్టుకుని రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. యుక్తవయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అంగీకరించాముని.
అగస్త్యుడు ఓ రోజున తన శిష్యులకు తత్త్వశాస్త్ర రహస్యాలను బోధించడం కోసం శిష్యులను దూరంగా తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నాడు. భర్త తనను విడిచి వెళ్లడంతో కావేరి కోపంతో ఒక తటాకంలో దూకింది. అయితే, ఆమె బ్రహ్మవర ప్రసాదిని కావడంతో మరణించడానికి బదులు నదిగా మారిపోయి బ్రహ్మగిరి పర్వతాల మీదుగా ప్రవహిస్తూ వెళ్లింది. ఆమే కావేరీ నదిగా ప్రసిద్ధికెక్కింది.మరో కథ ఏమిటంటే, తనని విడిచి ఉండరాదన్న భార్య కోరికను మన్నించి అగస్త్యుడు ఆమెను జలరూపంలోకి మార్చి తన కమండలంలో ఉంచుకుని ఎల్లప్పుడూ తనవద్దే ఉంచుకునేవాడు. అయితే, ఒకసారి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన క్షామం వచ్చింది. వర్షాలు లేక జలాశయాలన్నీ ఎండిపోయాయి. పంటలు పండక ప్రజలు అల్లాడుతూ, విఘ్నేశ్వరుని ప్రార్థించారు.
వినాయకుడు ఆవు రూపంలో అగస్త్యుని వద్దకు వచ్చి, గడ్డిమేస్తున్నట్లు నటిస్తూ, కమండలాన్ని తన ముట్టెతో కింద పడేలా చేశాడు. దాంతో కావేరి కాస్తా నదీరూపాన్ని సంతరించుకుని, అక్కడినుంచి తన పుట్టినిల్లైన బ్రహ్మగిరి వరకూ ప్రవహించింది.
కావేరీ పుష్కర స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.
పుష్కర స్నాన విధి
ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి. మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. దీర్ఘాయువునిచ్చే నదీపూజలు: పుష్కర యాత్రలు చేసిన వారికి, నదీ పూజలు నిర్వహించిన వారివి వ్యాధులు, పాపాలూ తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణగాథలు విదితం చేస్తున్నాయి.
ఏమిటీ పుష్కరం?
పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఈ çసమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి.
కర్నాటక రాష్ట్రంలో శ్రీరంగపట్నం, మైసూరు, శ్రావణబెల్
గోల, ధర్మస్థలం, వర్నాడు, కొక్కిసుబ్రమణ్యం, ఉడిపి, శృంగేరి, గోకర్ణం లాంటి మహా పుణ్యక్షేత్రాలు
తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం, జంబుకేశ్వరం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచెందూరు, చిదంబరం, కుంబకోణం వంటి పుణ్యక్షేత్రాలు.
కావేరీ నదీ పుష్కరాల వివరాలు*
12-09-2017 నుండి 23-09-2017 వరకు
కావేరీనదిని దక్షిణ గంగ అని పిలుస్తారు.
సహ్యపర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,320 మీటర్ల ఎత్తున మైసూర్లోని బ్రహ్మగిరి కొండపై కావేరి ఆవిర్భవించింది. *కొడుగు లేదా కూర్గు* అనే ప్రాంతం ఈనదికి రూపకల్పన చేస్తుంది. కావున ఈ నది ‘‘కూర్గుకువూరి’’ అని కావేరి ఉద్భవించే ప్రదేశాన్ని తలక్కాలేరా అని అంటారు. కావేరీ పుట్టెచోట ఒకచిన్న తొట్టె ఆకారంలో ఉంటుంది.
ఈతలక్కామేరీలో కావేరీమాత పెద్ద విగ్రహం ఉంది. కావేరీ దేవతగా భక్తులు పిలుస్తారు. భక్తుల కోర్కెతీర్చే ఇలవేల్పుగా కావేరీ దేవత పేరు పొందినది. ఈ దేవతకు ప్రతిఏటా శ్రావణమాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది.
దక్షిణగంగగా పేరుపొందిన కావేరికి షింసా, భవాని అనే రెండు ముఖ్యమైన ఉపనదులు చెప్పబడుతున్నాయి.
ఇవికాక కనక, సుజోజ్యోతి, హేమావతి, లోకాపాము, అర్ఖావతి, తొప్పైయ్యేరు శరభంగ, మణిమధుర, హాళే, సాగరఘాటె, లక్ష్మణతీర్థ, కాబినికుండల, అమరావతి మొదలగు చిన్నపెద్ద మొత్తం కలిసి 50కిపైగా కావేరికి ఉపనదులు ఉన్నాయి.
వీటివల్ల కావేరివెడల్పు పెరిగి ప్రవహిస్తుంది. 
కావేరి పరివాహక ప్రాంతం అంతా సస్యశ్యామలం. అందుకే కావేరీని ‘‘పొన్ని’’ అని అంటారు.
పొన్ని అంటే ధాన్యం అని బంగారు అని రెండు అర్థాలు. ఈ నది ధాన్యసమృద్ధి కలిగించేది, బంగారు పంటలు పండిచేదని ఈ కావేరినదికి పేరు.
కూర్గుకొండల్లో జన్మించి కొంతదూరం పర్వతసీమలందే ప్రవహించి తర్వాత ఆగ్నేయదిశగా ప్రవహించి మైసూరు రాష్ట్రంలో పీఠభూమి దశవదిలి క్రిందన గల పల్లంలోనికి శివసముద్రంవద్ద దూకుతుంది. ఇక్కడ కావేరి రెండుగా చీలుతుంది. ఈ రెండు చీలకల పేర్లు పరుచుక్కి, గగనచుక్కి అని పిలుస్తారు. పరచుక్కి 230 అడుగులు క్రిందకి ఒక జలపాతంలా పడుతుంది.
గగనచుక్కి అద్భుతంగా 90 కి.మీ. కొండచరియల్లోకిపడి కావేరీనదీ అలసటలేకుండా ప్రవహిస్తుంది. శివసముద్రం దాటిన తర్వాత కావేరి తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించి, తంజావూరు జిల్లాలో అధికశాతం ప్రవహించి కావేరి అక్కడనుండి మరికొంతదూరం సాగి బంగాళాఖాతంలో కలుస్తుంది.
స్నానయోగ్యమైన కావేరి నదీతీర పుణ్యక్షేత్రాలు.
*చిదంబరం*
అతిప్రాచీన దేవాలయం, శివుడు ప్రళయతాండవం చేస్తున్న అతిపెద్ద విగ్రహం.
నాలుగుదిక్కులు నాలుగు రాజగోపురాలు నటరాజస్వామి ఆలయంలో ఆలయంలోని నృత్యమందిరంలో ఎన్నో నృత్యభంగిమలు వందలకొలది వున్నాయి.
వెయ్యి స్తంభాల మంటపం అత్యుద్భుతంగావుంది. ఈక్షేత్రం పంచలింగాల్లో ఒక్కటైన ఆకాశలింగము ఉంది. ఈ క్షేత్రం తంజావూరుకు 106 కి.మీ. దూరంలో ఉంది. ఈ క్షేత్రం కావేరినది ఒడ్డునవుంది.
*శ్రీరంగం* :
ఈ క్షేత్రములో రంగనాధులు, రంగనాయకలు ప్రదానదేవతలు. ధనుర్మాసంలో గొప్పగా ఉత్సవాలు జరుగుతాయి.
ఈ క్షేత్రంలో 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో, 24 మంటపాలతోపాటు వేయిస్తంభాల మంటపం కల్గిన అతిపెద్ద వైష్ణవక్షేత్రం.
ఈ క్షేత్రాన్ని మద్రాసు బెంగుళూరు నుండి రైలుమార్గాలు కలవు. ఈక్షేత్రం తిరుచినాపల్లి (తిరుచ్చి) ప్రక్కన కావేరి నది ఒడ్డున కలదు.
*తంజావూరు*
చోళరాజులునిర్మించారు. ఇక్కడ స్వామి బృహదీశ్వరేశ్వరుడు. అమ్మవారు బృహన్మాక, గర్భాలయం 81 టన్నుల గొప్ప శిలలతో నిర్మితమైనది. శ్రీరంగం క్షేత్రమునకు సుమారుగా 90 కి.మీ దూరం ఈ క్షేత్రం కలదు.
*కుంభకోణం*
ఈ ప్రాంత చోళరాజులు పరిపాలించిన ప్రదేశం. ఈక్షేత్రంలో ప్రసిద్ధిమైన 4 విష్ణాలయములు, 12 శివాలయములు వున్నది.
కుంభకోణ క్షేత్రమంతా దేవాలయాల సముదాయమే. ఈ క్షేత్రం *తంజావూరు*నుండి 38 కి.మీ. దూరంలో ఉన్నది.

Thursday, 7 September 2017

శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంకొరకు........

శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంకొరకు........
శాస్త్రాలలో “ధర్మార్ధ, కామ, మోక్షాణా౦ పురుషార్ధ చతుష్టయం”.... అని మానవుని ఉన్నతిని కోరి నాలుగు రకాల పురుషార్ధములను చెప్పారు. వాటిలో మొదటిది ధర్మం, రెండవది అర్ధం, మూడవది కామం (కోరికలు, సంతానం), నాలుగవది మోక్ష ప్రాప్తికి తగిన సాధనాలు.
జీవితంలో ధర్మానికి ప్రధమ స్థానం ఇవ్వాలని, దానికి పెద్ద పీట వేయాలని, ధర్మ నియమాలను పాటించాలని, దైవం పట్ల, గురువుల పట్ల, గౌరవం, శ్రద్ధ వుండాలని మనకు శాస్త్రములు చెబుతున్నాయి. ధర్మాన్ని పాటిస్తూ లక్ష్మి సాధన ప్రాప్తి ఎలా పొందగాలమో ఇప్పుడు మనము తెలుసుకొందాము.
ధర్మము నుండే సంపద లబిస్తుంది. కానీ దానికి తోడూ సంపద కోసం ఈ పరుగుల జీవితములో, పోటీ ప్రపంచములో వ్యాపారం లేదా ఇతర పనుల ద్వారా ధనమును సంపాదించడానికి కొన్ని విశేష సాధనాలు, ప్రక్రియలు మనకు తంత్ర శాస్త్రములలో, వేదములలో, పురాణములలో చెప్పబడినవి.
దేవతలలో శ్రేష్టుడైన విష్ణు భగవానుని భార్యగా లక్ష్మి దేవికి స్థానం. శాస్త్రాలు ఆమె గొప్పతనాన్ని, మహత్వాన్ని చాటి చెప్పినాయి. లక్ష్మి యొక్క ఉపాసన మన జీవితాలలో ఎంతో ఆవశ్యకమైన ఉపాసన అనేది స్పష్టమైన మాట. అయితే ఇతరులను మోసగించి, అనైతిక మార్గముల ద్వారా ధనాన్ని సంపాదించ కూడదు. గౌరవముగా శాస్త్ర నియమాలకు లోబడి, ధర్మ మార్గములో శ్రమించి ధనాన్ని సంపాదించాలి. ధనవంతుడు లక్షాధికారి కావడం నేరము కాదు, అధర్మం కాదు. దారిద్ర్యాన్ని పారద్రోలడమే శ్రీ లక్ష్మీ ఉపాసన. వేద సమ్మతమైన, శాస్త్ర సమ్మతమైన మార్గములలో శ్రీ లక్ష్మీ సాధన చేసి, శ్రీ మహా లక్ష్మి అనుగ్రహము ఎలా పొందడము అనేది ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యము. మన జీవితాలను సుఖమయం చేసుకోవడం ఎలాగా? శ్రీ మహాలక్ష్మి కటాక్షం పొందడం ఎలాగా? మన దురదృష్టాన్ని ఎలా తొలగించుకోవాలి? దారిద్ర్యాన్ని మార్చి శ్రీ సంపన్నులు కావడానికి ఒకే ఒక మార్గం సాధన. సాధన మన భాగ్యంలో మార్పు తెస్తుంది. అనుష్టానం వలన ఇది మనము సాధించ వచ్చును. అమ్మ యొక్క కృప పొంద వచ్చును. మన జాతక చక్రం మారి పోతుంది. నిశ్చితమైన సాధన ద్వారా ఇది సాధించ వచ్చును. మన తల వ్రాతలు మార్చు కోవచ్చును. అమ్మ మీద నమ్మకం వుండాలి. ధార్మిక మైన కోరికలతో, శుద్ధ సాత్విక రూపములో శ్రీ లక్ష్మీ సాధన, మంత్ర సాధన చేస్తే తప్పక మీ కోరిక నెరవేరుతుంది, మీ దారిద్ర్యము తొలిగి మీరు నిస్సంకోచముగా ధనవంతులు అవుతారు.
ధన ప్రాప్తికి ఆటంకాలుగా వున్న భాధలు దూరమౌతాయ్. ఉన్నతమైన ఉద్యోగము లభిస్తుంది, అనుకూలత ఏర్పడుతుంది, ప్రమోషన్లు లభిస్తాయి, అధికారుల వలన ఇబ్బందులు తొలగి పోతాయి, మానసిక ఆందోళన తొలగి పోతుంది, వ్యాపారములో సానుకూలత ఏర్పడుతుంది, లాభాలు సమకూరును, నష్టాలు తొలగి పోవును, చింతలు తొలగి, ప్రశాంత ఏర్పడును, ఇంటిలోని సమస్యలు తొలగి పోవును, ఆర్ధిక ఇబ్బందులు తొలగి పోవును. సంతానము కలుగును. జీవితములోని అన్ని సమస్యలు తొలగి పోవును, సుఖ సంతోషములు కలుగును.
కనకధారాస్తవమును రోజుకు తొమ్మిది సార్లు వంతున 40 రోజులు శ్రద్ధతో, బ్రహ్మచర్యము, భూశయనము, ఏక భుక్తము, నియమములతో చేయ వలెను.

Tuesday, 5 September 2017

సత్సాంగత్యము అంటే ఏమిటి.......

సత్సాంగత్యము అంటే ఏమిటి.......
సత్సంగత్వే నిస్సంగత్వమ్ నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్వమ్ నిశ్చలతత్వే జీవన్ముక్తిః
సత్సంగత్వంలో ఒక క్షణం గడపడం వలన జన్మజన్మల సంస్కారం కలుగుతుందట. అందుకు ఒక కథ ఉంది. ఒకసారి నారద మహర్షికి 'సత్సంగం అంటే ఏమిటి? దాని వల్ల కలిగే ఫలితాలేమిటి?' అనే సందేహం కలిగి దానిని నివృత్తి చేసుకోవడం కోసం శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లి ఆయనను అడిగాడు. అప్పుడు శ్రీహరి, 'ఓస్! ఇంత మాత్రానికే నా దగ్గరకు రావాలా? అదిగో అక్కడ ఒక పురుగు పాకుతోంది. దాన్ని అడుగు' అన్నాడు. అలాగే వెళ్లి ఆ పురుగుని 'సత్సంగమంటే ఏమిటి?' అని అడిగాడు నారదుడు. దానికి ఆ పురుగు 'సత్సంగమంటే.' అంటూ ప్రాణం వదిలేసింది. నారదుడు ఇలా జరిగిందేమిటా అనుకుంటూ మళ్లీ విష్ణుమూర్తి దగ్గరకొచ్చాడు.
ఈసారి 'అదిగో అక్కడ చెంగనాలు పెడుతున్న కోడెదూడను అడుగు' అనగానే నారదుడు కోడెదూడను అదే ప్రశ్న అడగడంతోటే అది కూడా ప్రాణం వదిలింది. నారదుడు మళ్లీ విష్ణువు దగ్గరకు వెళితే, 'ఒక లేడి పిల్లను కంటోంది. పుట్టే ఆ పిల్లను అడుగు చెబుతుంది' అనడంతో నారదుడు అప్పుడే పుట్టిన లేడిపిల్లను అడిగాడు.
నారదుడికి అదే అనుభవం ఎదురయింది. నారదుడు బాధపడుతూ గట్టిపట్టుదలతో మళ్లీ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లాడు. విష్ణువు చిద్విలాసంగా 'నారదా! కాశీరాజుకు ఒక చక్కటి కుమారుడు పుడుతున్నాడు.
అతడిని అడిగి నీ సందేహం తీర్చుకో'అన్నాడు. అప్పుడు నారదుడు ''స్వామీ! మీరు నా సందేహం తీర్చుకొనేందుకు వెళ్లమంటున్నారా? లేక బిడ్డకు ఏదైనా అపాయం జరిగితే నాకు దేహశుద్ధి చేస్తారనే ఉద్దేశ్యంతో అక్కడకు పొమ్మంటున్నారా?'' అని అడిగాడు.
అందుకు శ్రీమహావిష్ణువు 'అటువంటిదేమీ జరగదు.
ఈసారి నీ సందేహం తప్పక తీరుతుంది. నీ రాకతో వారెంతో సంతోషిస్తారు'అని చెప్పడంతో నారదుడు కాశీరాజు ఇంటికి వెళ్లాడు. కొడుకు పుట్లిన ఆనందంలో అక్కడ వారందరూ ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో నారదుడు అక్కడికి రావడంతో వారంతా సంతోషంతో స్వాగతం పలికి అతిథిమర్యాదలు చేశారు.
నారదుడు ఆ బిడ్డను ఆశీర్వదించి ''నా సందేహం తీర్చవలసింది అంటూ వచ్చిన విషయం చెప్పాడు. అప్పుడు ఆ బిడ్డ, 'స్వామీ! మీరు నన్ను ఈ ప్రశ్న ముందు పురుగుగా ఉన్నప్పుడు, తర్వాత కోడెదూడగా ఉన్నప్పుడు వేశారు. ఆ తర్వాత జింకపిల్లగా ఉన్నప్పుడు వేశారు.
ఆ మాట వినటం చేత ఆ జన్మలన్నీ రహితమయ్యి ఈ జన్మ సంప్రాప్తించింది. అనగా కేవలం 'సత్సంగం' అనే ఒక్కమాట వినడంతోటే నాకు ఒకదాని తర్వాత మరొకటి ఇన్ని పవిత్రజన్మలు లభించాయి కదా! మరి ఇక నిజంగా సత్సాంగత్యం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో కదా! నేను నీకు సర్వదా కృతజ్ఞుడిని'' అన్నాడు ఆ బాలుడు.

Monday, 4 September 2017

గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు.............

గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు.............
పరమపురుషుడు – శివుడు (లేదా విష్ణువు), అవ్యక్త శక్తి – ఉమాదేవి (లేదా లక్ష్మి) వీరిరువురి సంయోగమైన సమన్యాయమూర్తి కుమారస్వామి. ఈయననే స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు మొదలైన పేర్లతో శాస్త్రాలు సన్నుతించాయి. కుమారస్వామిని అర్చించడం అంటే, పార్వతీ పరమేశ్వరులను (లక్ష్మీ నారాయణులను) ఆరాధించడమే. బ్రహ్మచేత నిర్మితమైన అగ్నిమయ దివ్య శరణం (రెల్లుతప్ప) లో శివతేజం షణ్ముఖాకృతి ధరించిందని గాథ. కుమారస్వామి యొక్క అగ్నిమయ శివశక్తి రూపాన్ని స్పష్టం చేసే గాథలో ఇది ఒకటి.
కాలకాలుడు శంకరుడు ‘కాలాగ్ని’ అని పిలువబడే ఈ అఖండ రుద్రమూర్తి యొక్క తేజస్సే ‘సంవర్సరాగ్ని’, ఈ సంవత్సరాన్ని ఆధారం చేసుకొనే కాలగణన సాగుతుంది. ఈ సంవత్సరాగ్నికి సంకేతమే – పన్నెండు చేతులు ఆరు ముఖాలు. ద్వాదశ హస్తాలూ పన్నెండు మాసాలకు, ఆరు ముఖాలూ ఆరు ఋతువులకూ సంకేతాలు.
ఇక స్వామి కూర్చున్న మయూరం ‘చిత్రాగ్ని’ అనబడే అగ్నితత్వమే వర్ణాలకు సంకేతమిది. అగ్ని, అమృతాల సమైక్యమూర్తి (అగ్నీ సోమాత్మకం) సుబ్రహ్మణ్యుడు. స్వామి చేతిలో ఉన్న శక్తి ఆయుధం, అమ్మవారు ఇచ్చినదే. ‘శివజ్ఞాన ప్రదాయిని’ అయిన శ్రీమాత ఇచ్చిన ఆ శక్తి బలం – జ్ఞానం. ‘అహంకారం స్కందం’ అని చెప్పబడ్డ ప్రకారం.... సృష్టిలోనూ, ప్రతి జీవులలోనూ ‘నేను’ అనే భావనే స్కంధుడు. మనస్సుతో కలిపి అయిదు జ్ఞానేంద్రియాలూ ఉన్న ‘అహంకారమే’ కుమారస్వామి. ఇచ్చ, జ్ఞాన, క్రియ – ఈ మూడు ఈ ఆరు ముఖాలతో సాగుతున్నాయి.
ఇచ్ఛా, జ్ఞాన, క్రియా రూప మహిశక్తిధరం భజే!
శివశక్తి జ్ఞానశక్తి స్వరూకమ్!! (శివపురాణం)
కవిత్వ సంగీతాది విద్యల్లో కూడా అగ్రగణ్యుడు స్కందుడు. సుబ్రహ్మణ్యుని కవిరూపంగా వర్ణించాయి పురాణాలు.
‘పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ... ‘అనే పద్యంలో స్వామిని కవిగా పేర్కొన్నాడు పోతన. మహామహిమాన్వితమైన షట్కోణం షణ్ముఖునికి ప్రతీక, అన్ని కోణాలనుండి సమగ్రంగా విషయ జ్ఞానం సాధించగలిగే నిశితమైన బహుముఖప్రజ్ఞే ‘షణ్ముఖీ ప్రతిభ.’ బ్రహ్మ విష్ణు, శివాత్మక పరబ్రహ్మ శక్తిగా సుబ్రహ్మణ్యుని ‘మురుక’ అన్నారు. ‘ము’ కారస్తు ముకుంద: స్యాత్ ‘రు’ కారో రుద్రవాచక:! ‘క కారో బ్రహ్మనాదీ ఛ మురుకో గుహవాచకం!! (స్కందపురాణం) రహస్యమైన బ్రహ్మజ్ఞానమే ‘గుహ’ రూపం. అదే గురురూపం.
గురుస్వరూపుడైన – శివశక్తుల సమన్వయమూర్తి సుబ్రహ్మణ్యుని ఆరాధించి సకల శుభాలను పొందవచ్చు. కుమార స్వామి జననం స్కందపురాణంలో కుమారస్వామి జననం గురించి ఇలా వివరించబడింది. శివుడు ధ్యాననిష్టలో వున్న సమయంలో ఆయన తపస్సును భంగపరచడానికి మన్మధుడు వచ్చాడు.
మన్మధుడు ఉపయోగించిన కామశరాలు శివునిపై పడగా కోపించిన శివుడు తన జ్ఞాననేత్రం తెరిచాడు. దాంతో మన్మదుడు భస్మమయ్యాడు. పరమేశ్వరుని జ్ఞాననేత్రం నుంచి కదలిన జ్ఞానాగ్ని మన్మదుని భస్మం చేసి, ఆకాశాన పయనిస్తుండగా దాన్ని వాయువు సంగ్రహించి తాళలేక, మోయలేక అగ్నిదేవునికిచ్చాడు. అగ్నిదేవుడు కూడా శివుని తేజాన్ని తనలో నిలుపుకోలేక గంగాజలంలో పడేశాడు. ఆ దివ్యతేజాన్ని గంగ కూడా తనలో నిలుపుకోలేక శరవణంలో పడేసింది. ఆ రెల్లుపొదలో కుమారస్వామి ఆవిర్భవించాడు. అందువల్ల కుమారస్వామి శరవణుడు, శరవనోద్భవుడు అని కూడా అంటారు.
మంగళకరమైన శివుని మూడవ కంటినుంచి ఉద్భవించిన జ్ఞానకిరణమే కుమారస్వామి జన్మకు కారణమైంది. రూప విశిష్టం..... కుమారస్వామికి ఆరు తలలు వుండడం చేత షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. సుబ్రహ్మణ్యస్వామి జ్ఞానస్వరూపం. అందుచేతనే అజ్ఞాన స్వరూపులైన రాక్షసులను హతమార్చాడు. అ జ్ఞానానికి ఆరు తాళాలుంటాయి. అవే – కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనే అరిషడ్వర్గాలు. ఆ ఆరు దుర్గుణాలున్న అజ్ఞాన రాక్షసిని ఆరుతలలు ఉంటే తప్ప చంపలేరు.
దైవ సంపదయైన ఆరు తలలు కలిగి అసుర సంపదకు సంభవించిన అరిష్టద్వార్గాలనే ఆరు తలలను తుంచివేయాలి. ఇదే షణ్ముఖుని రూప వైశిష్ట్యము.

Saturday, 2 September 2017

మహాలయ పక్షం...............

మహాలయ పక్షం...............
భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య నైనా చేసి తీరాలి. దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితంలో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు. మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి.ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమి పై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి, ప్రతి మాసంలోను అమావాస్య, పితరుల పుణ్య తిథిగా భావించబడినా, మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది. షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది. సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది. అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది త్రయోదశి నాడు శ్రద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే, పితృ పక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు, అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.