Saturday, 21 October 2017

వైఖానస ఆగమం.......

వైఖానస ఆగమం......
శ్రీ లక్ష్మీ వల్లభారంభాం విఖనో ముని మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యంతాం వన్దే గురు పరంపరామ్ ||
శ్రీమహావిష్ణువుని ప్రప్రథమంగా అర్చన చేసిన మహర్షి విఖనస మహర్షి అందుచే వారి వంసానుగమంగా విఖనసునికి జన్మించిన పుత్ర సంతతిని వైఖానసులు అంటారు. వీరు ఇంద్రునికి అత్యంత ప్రీతిపాత్రులు. నిత్యం శ్రీపతిని పూజించేవారు.
నారాయణః పితా యస్య మాతా చాపి హరిప్రియా |
భ్రుగ్వాది మునయః శిష్యా తస్మై శ్రీ విఖనసే నమః ||
ఆనందితాచార్య మనన్య భాజనం సుత్ర్యైక నిష్టం కరణ త్రాయేణా |
అనారతం శ్రీపతి పాద పద్మయో: నమామి వైఖానస మాది వైష్ణవం ||
శ్రీమద్రామానుజాచార్యుల వారు వైఖానుసుల యొక్క విశిష్టతను కీర్తిస్తూ తెలిపిన శ్లోకం ఇది. ఏ సుత్రమైతే నిందించటానికి శక్యము కానిదో, ఎవరైతే దైవిక, శ్రౌత, శారీరక కర్మలను ఒకే సూత్రము ద్వారా నిత్యమూ శ్రీపతి ఐన శ్రీమహావిష్ణువు యొక్క పాద పద్మములను ఆరాదించినారో వారే వైష్ణవ సంప్రదాయానికి నాంది పలికింది. వారే ఆది వైష్ణవులు.వారే వైఖానసులు.
విష్ణువుని ముఖ్య దైవంగా కొలిచే వైఖానసులు ఇప్పటికీ తమ యొక్క వైఖానస భగవత్ శాస్త్రం అనే ప్రాథమిక గ్రంధం ఆధారంగా తిరుమలలో వేంకటేశ్వరునికి, శ్రీరంగంలో శ్రీరంగనాధునికి మరియు ఇతర ప్రముఖ వైష్ణవ ఆలయాలలో నిత్యపూజలను అందిస్తున్నారు.
వైఖానసులు, వారి నమ్మకం ప్రకారం, వైదిక సాంప్రదాయమైన కృష్ణ యజుర్వేదీయ తైత్తీరియ శాఖను పాటించే జీవిత సమూహం. వైఖానస సాంప్రదాయం ప్రకారం ఋషివిఖనసుడు మహావిష్ణువు యొక్క అంశతో మహావిష్ణువుకే జన్మించాడు. బ్రహ్మతో పాటుగానే ఇతనికి ఉపనయనం జరిగింది. మహావిష్ణువే గురువుగా సమస్త వేదాలు, మరియు భగవత్ శాస్త్రాన్ని అభ్యసిస్తాడు. ఆపై భూమి మీదకి నైమిశారణ్యం వద్దకు వస్తాడు. అక్కడ వైఖానస కల్పసూత్రాన్ని రచించి తన నలుగురు శిష్యులైన అత్రి, భృగువు, కశ్యపుడు మరియు మరీచికి ఉపదేశిస్తాడు. అత్రికి సమూర్తార్చన, భృగువుకి అమూర్తార్చన, కశ్యపుడికి తర్కం-జపం, మరియు మరీచికి అగ్ని హుతం పై ఉపదేశాలు చేస్తాడు. వైఖానసుల ప్రకారం వైదిక హవిస్సు క్రతువునే వీరు కొనసాగిస్తున్నారు. యాగం చేస్తూ అగ్నిలో హవిస్సులు పోస్తే వచ్చే ఫలితమే వైష్ణవారాధాన ద్వారా వస్తుందని నమ్ముతారు.
వీరు ముఖ్యంగా విష్ణువు యొక్క ఐదు రూపాలను కొలుసారు.
విష్ణువు – సర్వాంతార్యామియైన దేవాదిదేవుడు
పురుషుడు – జీవితం యొక్క సూత్రము
సత్యము – దైవం యొక్క మారని అంశం
అచ్యుతుడు – మార్పు చెందని వాడు
అనిరుద్ధుడు – ఎన్నటికీ తరగని వాడు
‘ఏ నఖాః తే వైఖానసాః ఏ వాలాః తే వాలఖిల్యాః‘ అన్న వేదశృతి వాక్యానుసారంగా ఎవరైతే అనఖా: అనగా పాపరహితులో వారే వైఖానసులు. వైఖానసాగమాను సారంగా జీవన శైలి కలిగియున్న వారిని ప్రత్యేకంగా వైఖానసులు అంటారు అలా ఎందుకనగా
శ్లోకం :
యే వైఖానస సూత్రేణ సంస్కృతాస్తు ద్విజాతయః
తే విష్ణు స దృశా జ్ఞేయం సర్వేషాం ఉత్తమోత్తమం |
వైఖానసానాం సర్వేషాం గర్భ వైష్ణవ జన్మనాం
నారాయణః స్వయం గర్భే ముద్రాం ధరాయేత్ నిజాం ||
వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. వీరి ప్రస్తావన మొదటి సారిగా మనుధర్మశాస్త్రంలో వస్తుంది. మనువు మనిషి యొక్క వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన వానప్రస్థం ఇంకా సన్యాసాశ్రమం గురించి చెబుతూ వైఖానస నిబంధనను తెలుపుతాడు. తద్వారా వైఖానస సముదాయం ఆ కాలానికే ఉందని తెలుస్తుంది. నారాయణీయంలో కూడా వీరి ప్రస్తావన వస్తుంది. కానీ సైద్ధాంతికంగా వైఖానస సూత్రాలు నాలుగోశతాబ్దికన్నా పాతవి కావని తెలుస్తోంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోంది. వైఖానసులు పూజారిలే కాక దేవాలయంలో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండే వారు. శ్రీవైష్ణవుల రాకతో వైఖానసుల ప్రాభవం తగ్గిపోయింది. రామానుజాచార్యుడి రాకతో ఈ ప్రాభవం మరింత తగ్గింది. రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసాడు. అయిదు స్థాయిలలో ఉన్నది పది స్థాయిలకు మార్చాడు (ప్రధానార్చకుడు-అర్చకుడు-తీర్థం (నీరు) తెచ్చే వ్యక్తి - వంట చేసే వ్యక్తి - ఘంటారావం చేసే వ్యక్తి ఉన్న వ్యవస్థ నుండి శూద్రులకు స్థానం కల్పిస్తూ నిర్మాల్యం తొలగించడం-పాలుపూలుపళ్ళు తేవడం- ఉత్సవ పల్లకీ మోయడం - గుడిలో తులసీవనం పోషించడం మొ॥ ఉన్న వ్యవస్థను నెలకొల్పడం). ఈ విధంగా శూద్రులకు ఎన్నడూలేని స్థానం దేవాలయంలో దక్కినప్పటికీ వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు.
వైఖానస-పాంచరాత్ర వైరం.....
ఒక కథనం ప్రకారం శైవుల రాక వలన వైఖానసులంతా తిరుమల ఆలయం చేరతారు. వీరు వీడి వచ్చిన ఆలయాలన్నీ అప్పటి చోళ రాజు స్వాధీనం చేసుకుని శైవాలయాలుగా మార్చివేస్తాడు. కొద్ది కాలానికి ఆ ఆలయాలలో తిరిగి వైష్ణవ పూజలను రామానుజుల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు కొనసాగిస్తారు. అంతలోనే అందరు వైఖానసులు నరికివేయబడతారు. అది చోళరాజు చేయించినదా లేక రామానుజులు చేయించిన చర్యనా అన్నది ఎవరికీ తెలీదు. ఆ విధంగా ఒక్క వైఖానస పురుషుడు కూడా మిగలకుండా అవుతుంది. అప్పుడు రామానుజులు వేంకటేశ్వర స్వామిని సమీపించి పూజాపునస్కారాల విషయమై చర్చిస్తూ, శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలో పూజలు జరగాలని స్వామి వారిని కోరతాడు. కానీ స్వామివారు ఒక వైఖానస బాలకుడి విషయం తెలిపి అతనికి ఉపనయనం చేయించి అతని చేతనే పూజలు జరిపించాలని కోరతాడు. రామానుజులు ఈ విషయమై విముఖంగా ఉంటాడు. పాంచరాత్రాగమంలోనే పూజలు జరగాలన్నది ఆయన ఆశయం. ఈ బాలుణ్ణి కూడా హతమార్చాలని పన్నాగం జరుగుతుంది. స్వామి పుష్కరిణిలో మునిగి తేలగానే ఆ బాలుడు వటువుగా మారిపోతాడు. స్వామివారి వైభవం తెలుసుకున్న ఇతరులు, రామానుజులు తిరుమల పూజలను తిరిగి వైఖానసులకే అప్పగిస్తాడు. అప్పటి నుండి తిరుమల ఆలయం మొదలు చాలా ఆలయాల్లో వైఖానస-శ్రీవైష్ణవ వైరం ముందుకొస్తుంది. నేటికీ కొన్ని ఆలయాలలో ప్రధానార్చకత్వంపై వివాదాలున్నాయి. అయినా శ్రీరంగంలోని రామానుజుల పార్థివశరీరమూర్తి అని చెప్పబడే తాన్ ఆన తిరుమేణికి పూజ చేసేది వైఖానసులే.

No comments:

Post a Comment