- నేడు వరలక్ష్మీ వత్రం
సూక్తం అంటే మంచిమాట. సు+ఉక్తం అంటే బాగా చెప్పబడినది అని అర్థం. వేదాల్లోని అనేక మంత్రాల్ని సూక్తాలని అంటాం. లక్ష్మీదేవిని స్తుతిస్తూ చెప్పే శ్రీసూక్తం శ్రావణ మాసంలో ప్రతి ఇంటా వినబడుతుంది. శ్రీః అంటే లక్ష్మి, సంపద అని అర్థం. సంపదల్లో దైవీసంపద అనీ, అసుర సంపద అనీ రెండు రకాలు.
సంపద కోరుకోవడం అనేది మంచి గుణమే. అయితే అది ధర్మానికి అనుగుణంగా ఉండాలి. ‘‘ధర్మానికి విరుద్ధంగా కానటువంటి కామం (కోరిక) భగవంతుని స్వరూపమే’’ అని భగవద్గీత కూడా చెబుతుంది.
పరమాత్మతత్వంలో ఉన్న అనంతమైన శక్తుల్లో లక్ష్మి అనేది ఒకటి. వేదాంత దృష్టితో చూస్తే శుద్ధబ్రహ్మ స్వరూపంలో ఏర్పడే సృజనాత్మక శక్తి లేదా ప్రకృతి అనేదాన్నే స్త్రీ రూపంలో భావించాడు వైదిక రుషి. పరమాత్మను పురుషునిగానూ, ప్రకృతి శక్తిని స్త్రీ రూపంగానూ భావించి వర్ణించారు. ప్రకృతిలో ఉన్న అపారమైన శక్తుల్లో జగత్తును పోషించే శక్తి, సంపద ముఖ్యమైనవి. దీన్ని గూర్చిన ప్రార్ధనయే శ్రీ సూక్తం.
వైదిక దేవతల్ని యజ్ఞాల ద్వారా పూజిస్తారని మనకు తెలుసు. యజ్ఞానికి ముఖ్యదేవత అగ్ని. ఇతనికి జాతవేదా నుంచి పుట్టడం వల్ల జాతవేదా అని కూడా పేరు. వేదాలు.. అంటే జ్ఞానం ఇతని నుంచి పుట్టడం వల్ల జాతవేదా అన్నారు. ఏ దేవతను ఆహ్వానించినా ఇతని ద్వారానే ఆహ్వానిస్తాం. అందుకే ఈ సూక్తంలోని మొదటి మంత్రం ఓ జాతవేదా లక్ష్మిని ఆహ్వానించు అని ఉంటుంది. లక్ష్మీదేవి ఎన్నోవిధాలుగా వర్ణించబడింది. ఆమె హిరణ్యవర్ణ అంటే బంగారు వన్నె కలది. హరిణి అంటే హరిని వెంటతీసుకొచ్చేది అని ఒక అర్థం, ఆడజింక అని మరొక అర్థం. ఉన్నచోట ఉండక చంచల స్వభావంతో అన్ని చోట్లకు తిరిగేది అనే అర్థం ధ్వనిస్తుంది.
రెండవ మంత్రంలో ‘లక్ష్మీం అనపగామినీం’ అన్నారు. అంటే ఎప్పటికీ తొలగిపోనటువంటి లక్ష్మి అని అర్థం. చంచలస్వభావమైనది ఎప్పటికీ తొలగిపోకుండా ఎలా ఉంటుంది? తొలగిపోకుండా ఉండేది జ్ఞానం మాత్రమే. ‘హర్తకు కాదు గోచరం’ అని భర్తృహరి అన్నట్లు దొంగ దొంగిలించలేని సొమ్ము జ్ఞానమొక్కటేనట.
నాల్గవ మంత్రంలో ఈమెను ఆర్ర్దా అన్నారు. అంటే కరిగిపోయే హృదయం కలది, భక్తుల కోరికలను తీర్చేది అని అర్థం. అయితే వెంటనే జ్వలంతీ అని కూడా అన్నారు. చెడ్డవాళ్ల పట్ల జ్వలించేది అని మరొక సంబోధన. అనగా భక్తుల హృదయం అనే పద్మములో ఉండేది అని ఒక అర్థం. మన సంప్రదాయంలో పద్మం అనేక చోట్ల కనిపిస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పద్మం నుంచి పుట్టినాడట. లక్ష్మీదేవి ఎప్పుడూ పద్మములోనే కూర్చొని ఉంటుంది. పద్మం సృష్టికీ, సంపదకూ చిహ్నం. తరువాత మంత్రంలో ఈమెను ప్రభాసా అన్నారు. భాసించడం అంటే ప్రకాశించడం. ప్రభాసా అంటే మిక్కిలి ప్రకాశించేది అని అర్థం. ప్రపంచంలో అన్ని ప్రాణులూ కోరుకునేది అని అర్థం. ఇదే మంత్రంలో ‘‘నా యొక్క అలక్ష్మి నశించుగాక’’ అని మరొక మాట ఉంది. అలక్ష్మి అంటే మనిషిలో ఉన్న చెడు గుణాలు, చెడు ఆలోచనలు. లక్ష్మీదేవి కేవలం సంపద మాత్రమే కాదు, మంచి గుణాల్ని కూడా ప్రసాదించేది అని అర్థం. అందుకే ఆ తర్వాత మంత్రంలో కూడా బాహ్యంగానూ, అంతరంగంలోనూ ఉన్న అలక్ష్మి నశించుగాక అని మళ్లీ ప్రార్థన. బాహ్యంగా ఉన్న అలక్ష్మి అనగా.. దరిద్రాన్ని పోగొట్టు అనే అర్థంలో వాడబడింది. అంతరంగంలోని అలక్ష్మి అంటే ఆధ్యాత్మిక దారిద్య్రం. దీన్ని కూడా తొలగించుమని ఇందులో ప్రార్థన.
నా ఇంట్లో స్నేహపూరిత వాతావరణం ఉండాలి అని మరొక మంత్రం (12) చెబుతుంది. ధనమున్న చోట స్నేహం, ప్రేమ ఉండకపోవచ్చు. వీటిని కూడా కోరుకోవడం భక్తుని పరిపక్వతను తెలుపుతుంది. ఆర్ర్దా అనే మాటను ఈ సూక్తంలో మూడుచోట్ల వాడారు. లక్ష్మి చాలా దయామయురాలు. అయితే యష్టిం అనే మాటలో ఆమె రాజదండాన్ని కూడా ధరించి ఉంటుందని చెప్పారు. అంటే ప్రజల్ని ధర్మమార్గంలో ఉండేటట్టు నియంత్రించేది అని అర్థం.
మనం అష్టైశ్వర్యాలు అనే మాట వింటూంటాం. ఎనిమిది రకాల ఐశ్వర్యాలు అని అర్థం. సేవకులు, పుత్రులు, బంధువులు, ధనం, ధాన్యం, వాహనాలు మొదలైనవి ఎనిమిది రకాల ఐశ్వర్యాలట. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, జయలక్ష్మి, సంతానలక్ష్మి మొదలైన అష్టలక్ష్ములనన్నింటినీ పై సూక్తంలోని మంత్రాలు ప్రార్థిస్తాయి. ఈ సూక్తం చివరలో ‘విష్ణుమనోనుకూలే’ అని ఒక మాట ఉంది. విష్ణువు మనస్సుకు అనుకూలంగా నడుచుకునేది అని అర్థం. విష్ణువు జగత్తు స్థితికి కారకుడు. మంచి, చెడుల్ని నిర్ణయించువాడు. లక్ష్మీదేవి అందుకు అనుకూలంగా వర్తించేది అనడం సరైన ఉపమానం.
లక్ష్మీదేవి పుట్టుకను, ఆమె తనకు తగిన వరుణ్ని ఎన్నుకోవడాన్ని భాగవతం ఎనిమిదో స్కంధం, ఎనిమిదవ అధ్యాయంలో చాలా అందంగా వర్ణించారు. దేవతలు, రాక్షసులు సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో లక్ష్మీదేవి పుట్టిందని పురాణగాథ. అలా పుట్టిన లక్ష్మీదేవిని చూసి దేవతలు, రాక్షసులు అందరూ ఆమె వెంటపడ్డారు. ఆమె అందర్నీ పరికించింది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచిగుణం ఉన్నా.. దానికి తోడు ఏదో ఒక బలహీనతను కూడా గమనించిందట. ఒకరిలో తపశ్శక్తి ఉంది, మరొకడు పండితుడు, ఇంకొకనిలో త్యాగం ఉంది అదే సమయంలో ఒకరిలో ధర్మం లేదు, వేరొకనిలో శీలం లేదు.. ఇలా ప్రతి ఒక్కరిలో ఏదో లోపం కనిపించింది. ఎలాంటి బలహీనతలు లేకుండా అన్ని మంచి గుణాలూ ఉన్న వ్యక్తిగా విష్ణువు ఒక్కడే కనిపించాడట. అయితే ఆమె వెంటపడనివాడు కూడా విష్ణువు ఒక్కడేనట. అందుకే ఆమె అతడ్ని వరించిందని వ్యాసుడు అందంగా వర్ణించాడు. లక్ష్మీదేవిని ‘విష్ణువక్షస్థల స్థితాం’ అని కూడా వర్ణించారు. విష్ణువు ఎదపైననే ఎప్పుడూ ఉండేది, అతని నుంచి విడదీయరాని శక్తి అని అర్థం. విష్ణుదేవుడు ఆదిశేషుడిపై పడుకొని ఉండగా, లక్ష్మీదేవి అతని కాళ్లు నొక్కడం అనేక సినిమాలలో చూశాం. దీనికి పురాణాల్లో మూలం ఎక్కడో తెలియదు. అయినా విష్ణువు యొక్క కాళ్లను ఒత్తడం అనేది పురుషాహంకారానికి చిహ్నంగా గాక.. సాంకేతిక అర్థం తీసుకుంటే లక్ష్మి అనే శక్తి అతని వశంలో ఉన్నా అతడు సంపదకు దాసుడు కాదు అనే అర్థాన్ని గ్రహించవచ్చు.
లక్ష్మి మనలో అనేక విధాలుగా ప్రకటమవుతుంది. ఈ రూపాల్ని గూర్చి తిరుమల పండితులు చెప్పే ఆశీర్వాద శ్లోకం ఒకటి చాలా అందంగా ఉంది. ముఖంలో భాగ్యలక్ష్మి, చేతిలో దానలక్ష్మి, భుజస్కంధాలలో వీరలక్ష్మి, హృదయపద్మంలో కరుణాలక్ష్మి, ఖడ్గం అంచున శౌర్యలక్ష్మి, గుణగణాలలో కీర్తిలక్ష్మి, శరీరమంతటా సౌమ్యలక్ష్మి ఇవన్నీ నీకు లభించుగాక అంటూ ఆశీర్వదిస్తుంటారు. అయితే కేవలం ప్రార్థన మాత్రమే గాక ఈ ఉదాత్తమైన గుణాలన్నీ మనిషి అలవర్చుకోవలసిన, అలవర్చుకోగలిగిన గుణాలు అని కూడా మనం గమనించవచ్చు.

No comments:
Post a Comment